: ఈ సర్పంచ్... ఇల్లు గడవడం కోసం కూరగాయలు అమ్ముతోంది!
కొందరు ప్రజాప్రతినిధులు పదవుల్లో కొనసాగుతున్నా ఇప్పటికీ పేదరికం కోరల్లోనే విలవిల్లాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా వీరారెడ్డి పల్లి సర్పంచ్ రాథోడ్ రుక్కీబాయి కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇల్లు గడవడం కష్టమవడంతో ఆమె కూరగాయలు అమ్ముతోంది. వచ్చే డబ్బులే ఆమె కుటుంబానికి ఆధారం. ఆమెకు నలుగురు సంతానం కాగా వారిలో ముగ్గురు అమ్మాయిలు. ఉన్న కొద్దిపాటి పొలంలో కూరగాయలు పండిస్తూ, వాటిని విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో బతుకుబండి లాగిస్తోంది. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ పదవి ఎస్టీ కేటగిరీకి వచ్చింది. దాంతో, రుక్కీబాయి ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గింది. కూరగాయలమ్మే వ్యక్తి కావడంతో గ్రామవాసులందరికీ ఆమె పరిచయస్తురాలే. ఆ పరిచయం ఎన్నికల్లో లాభించింది. సర్పంచ్ గా నెగ్గినా కూరగాయల విక్రయాన్ని మాత్రం వదలలేదు. వీరారెడ్డిపల్లికి అనుబంధంగా ఉన్న నాలుగు గ్రామాల్లో ఆమె కూరగాయలు అమ్మేందుకు వెళుతుంది. అలా అన్నిగ్రామాల్లో తిరగడం ద్వారా సమస్యలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉండడం ఆమెకు కలిసొచ్చింది. దీంతో, ఉన్న నిధులతోనే ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందట.