: పొన్నాల చూసింది ట్రయిలరే, ముందు చాలా సినిమా ఉంది: కేటీఆర్
సర్కారు నిర్ణయాలను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. పీసీసీ చీఫ్ పొన్నాల పాదయాత్ర చేసినా, మోకాళ్ల మీద యాత్ర చేసినా అధికారంలోకి రావడం కల్ల అని వ్యాఖ్యానించారు. పొన్నాల ఇప్పటివరకు చూసింది ట్రయిలరే అని, ముందు చాలా సినిమా ఉందని అన్నారు. భవిష్యత్తులో పొన్నాల ఎన్నో యాత్రలు చేయాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితిని ఓ కళేబరంతో పోల్చారు. సచివాలయం తరలింపు వెనుక నిర్దిష్ట ప్రణాళికతో ఉన్నామని, దాన్ని రాజకీయం చేయడం తగదని సూచించారు. పాలనా సౌలభ్యం కోసమే సచివాలయం తరలింపు అని స్పష్టం చేశారు. ఈ విషయంలో అవసరమైతే విపక్షాలతో చర్చిస్తామని చెప్పారు. తాము ప్రజలకు మాత్రమే బాధ్యత వహిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు అధికారం చేజారిన ఆరు నెలలకే ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు.