: చంద్రబాబుపై నాంపల్లి కోర్టులో పిటిషన్... విచారణ 18కి వాయిదా
'హైదరాబాదులో ఉండి పరిపాలిస్తుంటే విదేశాల నుంచి పరిపాలించినట్లు ఉంది' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడంపై కేసు నమోదు చేయాలని తెలంగాణ న్యాయవాదుల సంఘం నేత కొంతం గోవర్ధన్ రెడ్డి నాంపల్లి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని తెలిపారు. హైదరాబాదును ఒక విదేశంగా పేర్కొనడమంటే దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమే అవుతుందని పిటిషనర్ వాదించారు. ఐపీసీలోని 153 (బి), 504, 505 సెక్షన్ల ప్రకారం ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. కాగా, తన ఫిర్యాదును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసును నెల 18కి వాయిదా వేసిందని గోవర్ధన్ రెడ్డి తెలిపారు.