: బతికుండగానే ముక్కలుగా నరికి హత్య... ఫిర్యాదు కోసం వెళితే 'లేచిపోయిందేమో’నన్న పోలీసులు!
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. లక్నోకు చెందిన గౌరి శ్రీవాస్తవ న్యాయశాస్త్ర విద్యార్థిని. గడచిన మంగళవారం నాడు అదృశ్యం అయింది. అత్యంత ఘోరంగా ఆమెను కొందరు కసాయిలు బతికుండగానే చిత్రహింసలు పెడుతూ విద్యుత్ రంపంతో కాళ్లు, చేతులు, వేళ్లు, తల... ఇలా తలచుకుంటేనే ఒళ్లు జలదరించేలా ఓ జంతు వధశాలలో ముక్కలుముక్కలుగా నరికి హత్య చేశారు. ఆపై దేహఖండాలను ఓ బస్తాలో మూటగట్టి పడేశారు. దొరికిన ఆమె శరీర భాగాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు అత్యాచారాన్ని మాత్రం నిర్ధారించలేదు. కాగా, ఫిర్యాదు చేసేందుకు ఎవరైనా వస్తే కేసును నమోదు చేసుకోవాల్సిన పోలీసులు గౌరి తండ్రితో అవమానకరరీతిలో ప్రవర్తించడం మరో దారుణం. తన కూతురు కనిపించట్లేదని స్టేషనుకు వస్తే ‘ఎవడితోనో లేచిపోయి ఉంటుంది’ అంటూ పోలీసులు అసభ్యంగా మాట్లాడారని, స్టేషన్ నుంచి గెంటేశారని ఆమె తండ్రి శిశిర్ శ్రీవాస్తవ కన్నీరుమున్నీరయ్యారు. కాగా, అక్కడి ఓ జంక్షన్ వద్ద ఉన్న సీసీటీవీలో ఆమె ఎవరో యువకుడితో మాట్లాడిన సంభాషణలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ యువకుడు ఎవరనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. కిరాతకుల క్రూరత్వం, పోలీసుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.