: రూ.5 కోట్లు గెలిచినా... బతుకు బండి దయనీయమే!


బీహార్ కు చెందిన సుశీల్‌ కుమార్ పేరు విన్నారా? ఎక్కడో విన్నట్టు ఉంది అనుకుంటున్నారా? అదేనండీ... అమితాబ్ నిర్వహించిన 'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో తొలిసారిగా రూ.5 కోట్లు గెలిచిన వ్యక్తి. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?... ఇప్పుడతను నిరుద్యోగి. ఖాళీగా ఇంట్లోనే ఉంటాడు. అదేంటి, ఉన్నట్టుండి రూ.5 కోట్లు వస్తే జీవితమే మారిపోతుంది, ఏదో ఒకటి చేసుకోవచ్చు అని అనుకుంటున్నారా? ఆ షోలో సుశీల్ రూ.5 కోట్లు గెలుచుకొని నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతడి పరిస్థితి ఏమిటి? అనే విషయం పరిశీలిస్తే, సుశీల్ నేటికీ తన సొంతూళ్లోనే ఉంటున్నాడు. ఉమ్మడి కుటుంబంతోనే గడుపుతున్నాడు. ఇదంతా సింప్లిసిటీ అనుకోవద్దు. ఇంతకన్నా గొప్పగా బతకడానికి తన ఆర్థిక స్థితి సరిపోలేదని సుశీల్ చెబుతాడు! రూ.5 కోట్ల ప్రైజ్‌ మనీలో పన్నులు పోను రూ.3.60 కోట్లు చేతికి వచ్చాయట. ఆ డబ్బుతో సొంతూళ్లో ఒక ఇల్లు కట్టడం, నలుగురు సోదరులు సెటిలవ్వడానికి కొంత కేటాయించడం, స్థానికంగా కొంత భూమిని కొని, మిగిలిన కొంచెం డబ్బును తల్లి పేరుతో బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయడంతో మొత్తం డబ్బులు అయిపోయాయట. ఇక ప్రత్యేకంగా తను సెటిలవడానికి, విలాసంగా గడపడానికీ డబ్బులేమీ లేకుండాపోయాయని అంటున్నాడు. వినడానికి కొంత విడ్డూరంగా, ఆశ్చర్యంగా ఉన్నా సుశీల్ ప్రస్తుత సాదాసీదా జీవన శైలి ఇదే వాస్తవమని చెబుతోంది. డబ్బు వచ్చిందనే ఆనందంలో చేస్తున్న ఉద్యోగం మానేశాడు. బీఎడ్ పూర్తి చేసినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు, సివిల్స్ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇప్పుడు బ్యాంక్‌లో ఉన్న మొత్తంపై వచ్చే వడ్డీ డబ్బు, ఇంటి దగ్గర ఉన్న నాలుగు ఆవులు సుశీల్ కుటుంబానికి జీవనాధారం. తన భార్య ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తితో ఉందని సుశీల్ చెబుతున్నాడు. అంత డబ్బు వచ్చినా తమ జీవితమేమీ మారలేదు కదా? అని అమె వాపోతోందట!

  • Loading...

More Telugu News