: యువీకి మొండి చెయ్యేనా?...భువీ, ఇషాంత్ ఫిట్ నెస్ ఆందోళనకరమే!
వరల్డ్ కప్ టోర్నీ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికీ టీమిండియా ఆటగాళ్ల ఫిట్ నెస్ పై అనుమానాలు తొలగిపోలేదు. రోహిత్ శర్మ, జడేజా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ లు ఫిట్ నెస్ నిరూపించుకుని తుదిజట్టులో చోటుదక్కించుకుంటారా? యువరాజ్ సింగ్ కు పిలుపు వస్తుందా? అని సగటు భారత క్రీడాభిమాని ఆశగా ఎదురుచూస్తున్నాడు. వరల్డ్ కప్ టోర్నీ ముందు యువీ రాణించినా సెలక్టర్లు అతనిని పరిగణనలోకి తీసుకోలేదు. ఆసీస్ సిరీస్ లో భారత ఆటగాళ్లు దారుణంగా విఫలమవుతుండగా, స్వదేశంలో యువీ బౌలర్లను ఉతికేశాడు. దీంతో యువీని వరల్డ్ కప్ కు తీసుకెళ్తే బాగుంటుందని ప్రతి అభిమాని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫిట్ నెస్ లేని జడేజాపై వేటు పడితే, యువీ వరల్డ్ కప్ పిలుపు అందుకునే అవకాశం ఉందని ప్రసార సాధనాలు కథనాలు ప్రచురించాయి. దీంతో టీమిండియా అభిమానుల్లో ఎక్కడో ఆశ మొదలైంది. జడేజా ఫిట్ నెస్ సాధించకూడదని కోరుకోకున్నా, యువీకి పిలుపురావాలని ఆశించారు. కాగా, రేపు టీమిండియా ఆటగాళ్లకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. మ్యాచ్ ఫిట్ నెస్ సాధిస్తే టోర్నీలో ఆటగాళ్లు పాల్గొనేందుకు అడ్డంకులు తొలగినట్టే. రోహిత్, జడేజా మ్యాచ్ ఫిట్ నెస్ సాధించడం లాంఛనమేనని జట్టు మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఇషాంత్, భువనేశ్వర్ కుమార్ ఫిట్ నెస్ మాత్రం టీమిండియాను బెంబేలెత్తిస్తోంది. టీమిండియా ప్రధాన బౌలర్లుగా ఉన్న వీరిద్దరూ టోర్నీకి దూరమైతే, ఫైనల్ ఆశలు వదిలేసుకోవాల్సిందేనని పలువురు పేర్కొంటున్నారు. మొత్తానికి వరల్డ్ కప్ లో పాల్గొనే ఆటగాళ్లపై పూర్తి స్పష్టత రేపు రానుంది.