: బాధ్యత కామెంటేటర్లదే...ఆటగాళ్లు కూడా గుర్తెరగాలి: ఐసీసీ రిఫరీ
పేలవ ఆటతీరుతో విమర్శలపాలవుతున్న భారత జట్టుకు ప్రపంచకప్ లో మద్దతుగా నిలవాలని టీమిండియా మాజీ పేసర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పిలుపునిచ్చాడు. ప్రపంచకప్ లో నిరాశాజనక ప్రదర్శనే కొనసాగించినప్పటికీ వారికి మద్దతివ్వాలని ఆయన సూచించాడు. ఈ మేరకు కామెంటేటర్లు అభిమానులకు మార్గదర్శకం చేయాలని శ్రీనాథ్ పేర్కొన్నాడు. గతంలో వ్యాఖ్యాతల వ్యాఖ్యల కారణంగానే ద్రవిడ్, కైఫ్ ఇళ్లపై రాళ్ల దాడి జరిగిందని గుర్తు చేశాడు. మ్యాచ్ ఓటమిపై కామెంటేటర్లు భావోద్వేగాలు ప్రదర్శించకుండా, అభిమానులకు దిశానిర్దేశం చేయాలని శ్రీనాథ్ ఆకాంక్షించాడు. అలాగే అభిమానుల అంచనాలు అందుకోవాల్సిన బాధ్యత ఆటగాళ్లపైనే ఉంటుందన్న విషయం వారు మరువకూడదని హితవు పలికాడు. ఈ వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలబెట్టుకోవాలంటే టీమిండియా బౌలర్లు విశేషంగా రాణించాలని సూచించాడు. బౌలర్లు తమ పని సమర్ధవంతంగా నెరవేరిస్తే, బ్యాట్స్ మన్ మిగిలిన పని చూసుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ లో ఎవరో ఇద్దరు ఆడితేనే వరల్డ్ కప్ రాదన్న విషయం టీమిండియా గుర్తించాలని ఆయన స్పష్టం చేశాడు. కనీసం ఆరుగురు బ్యాట్స్ మన్ తమ బ్యాట్లకు పని చెబితేనే టీమిండియా తన హోదా నిలబెట్టుకుంటుందని ఆయన వెల్లడించాడు.