: తదుపరి బీహార్ సీఎంగా తెరపైకి నితీష్ కుమార్... రాజీనామా చేయనంటున్న మాంఝీ!


బీహార్ లో ముఖ్యమంత్రి పదవి విషయంలో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రస్తుత సీఎం జితన్ రాం మాంఝీని తొలగించి అ పదవిలో నితీష్ కుమార్ ను తీసుకురావాలని జేడీ(యు) భావిస్తోంది. అటు, సీఎం అయ్యేందుకు నితీష్ సిద్ధంగా ఉన్నారని, ఆయనకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేత శరద్ యాదవ్ తో రేపు ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. సీఎం మార్పుపై ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి దూరంగా ఉండాలని సీఎం మాంఝి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సీఎం మార్పు జరగబోతోందన్న వార్తలపై స్పందించిన ఆయన, తాను పేదలకోసమే పనిచేస్తున్నానన్నారు. తనపై చాలా ఒత్తిడి ఉందని చెప్పారు. అయితే, పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచిన మాంఝీపై పార్టీ నాయకత్వం అసంతృప్తిగానే ఉంది. ఎప్పుడైనా ఆయనను పదవి నుంచి తొలగించే అవకాశముందని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకునేందుకు మాంఝీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన జేడీ(యూ)... ఆర్జేడీతో కలసి బీజేపీపై పోరాడాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ సీఎం కావాలని నితీష్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News