: తిరుపతిలో ప్రచార జోరు పెంచిన టీడీపీ
తిరుపతి ఉప ఎన్నిక దగ్గరపడుతుండడంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా జోరు పెంచింది. రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు, తిరుపతి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని విమర్శించారు. తిరుపతి అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలను కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ తరపున వెంకటరమణ సతీమణి సుగుణమ్మ బరిలో ఉన్నారు. తొలుత ఆమె ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని భావించినా, అనూహ్యరీతిలో కాంగ్రెస్ తన అభ్యర్థిని బరిలో దించింది. దీంతో, అక్కడ ఫిబ్రవరి 13న పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.