: ఐఎస్ తీవ్రవాదులు నరహంతకులు, రేపిస్టులు: మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ
ఇరాక్, సిరియాల్లో మారణ హోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులపై హైదరాబాదు ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. ఐఎస్ తీవ్రవాదులను నరహంతకులుగానే కాక రేపిస్టులుగానూ ఆయన అభివర్ణించారు. ఇస్లాంకు ఐఎస్ఐఎస్ ప్రధాన శత్రువని కూడా ఒవైసీ వ్యాఖ్యానించారు. జిహాద్ అంటే రక్తపాతం, విధ్వంసం కాదని చెప్పిన ఆయన, యువత తప్పుదారి పట్టడం సబబు కాదని పేర్కొన్నారు. నిన్న పాతబస్తీలోని జామియా నిజామియా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇస్లాంకు ఐఎస్ఐఎస్ తో ఎలాంటి సంబంధం లేదని ఒవైసీ చెప్పారు. జిహాద్ పేరిట ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లలో కనిపించే సమాచారాన్ని చూసి యువత తప్పుదారి పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిహాద్ కు స్పష్టమైన అర్థం కోసం మతగురువులను సంప్రదించాలని ఒవైసీ యువతకు పిలుపునిచ్చారు. నిజమైన జిహాద్ చేయాలనుకునే యువత ముందుగా తమ బస్తీల్లోని చెడుపై సమరం చేయాలన్నారు.