: భారత్ లోకి నకిలీ కరెన్సీ చేరవేతలో పాక్ దౌత్యవేత్త... బహిష్కరించిన బంగ్లాదేశ్
నకిలీ కరెన్సీతో భారత ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు యత్నించిన పాకిస్థాన్ దౌత్యవేత్తపై బంగ్లాదేశ్ బహిష్కరణ వేటేసింది. ఈ ఉదంతం నేపథ్యంలో ఢాకాలోని పాక్ విదేశాంగ కార్యాలయంపై బంగ్లాదేశ్ నిఘా పెంచింది. వివరాల్లోకెళితే... ఢాకాలోని పాక్ దౌత్య కార్యాలయంలో అసిస్టెంట్ వీసా ఆఫీసర్ గా పనిచేస్తున్న పాక్ దౌత్యవేత్త మజర్ ఖాన్, స్థానికులతో కలిసి నకిలీ కరెన్సీని భారత్ లోకి తరలించే ముఠాకు సహకరించాడు. అసోం, పశ్చిమ బెంగాల్ సరిహద్దు మీదుగా జరుగుతున్న ఈ తంతుపై సమాచారం అందుకున్న బంగ్లా పోలీసులు మజర్ ఖాన్ తో పాటు మరో స్థానికుడిని గత నెల 12న అరెస్ట్ చేశారు. అయితే దౌత్యపర అంశాలను పరిగణనలోకి తీసుకుని మజర్ ఖాన్ ను విడుదల చేశారు. నకిలీ కరెన్సీని తరలిస్తూ పట్టుబడ్డ మజర్ ఖాన్ ను దేశం నుంచి బహిష్కరించినట్లు బంగ్లా ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, ఈ విషయంపై స్పందించేందుకు బంగ్లాలోని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి నిరాకరించారు.