: కేజ్రీవాల్ కు మద్దతు వెల్లువ... మంచి వ్యక్తి అంటూ బీజేపీ నేత పొగడ్తలు!
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతు వెల్లువెత్తుతోంది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ కు సంబంధించిన ప్రచారం నిన్న సాయంత్రంతో ముగిసింది. ఈ సమయంలో బీజేపీకి చెందిన సీనియర్ నేత శత్రుఘ్న సిన్హా, కేజ్రీవాల్ కు మద్దతుగా ప్రకటన చేశారు. ‘‘కేజ్రీవాల్ మంచి వ్యక్తి. ఆప్ కు అవకాశాలు మెరుగవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆప్ గురించే మాట్లాడుతున్నారు. వార్తా పత్రికలు, టీవీ ఛానెళ్లలో వారి గురించే చర్చ. నిజాయతీ అధికారిగా పేరుగాంచిన కిరణ్ బేడీతో పోటీ పడుతున్న కేజ్రీవాల్ కూడా మరో నిజాయతీ అధికారే’’ అంటూ సిన్హా ప్రకటించారు. అంతేకాక, బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీ కంటే హర్ష వర్ధన్ ను బరిలోకి దించి ఉంటే బాగుండేదంటూ ఆయన వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఇప్పటికే కేజ్రీవాల్ కు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆప్ అభ్యర్థులకే ఓటు వేయాలంటూ సీపీఎం ఇదివరకే తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది.