: ఐసీసీ బ్యాట్ సైజ్ ప్రతిపాదనపై మండిపడ్డ గేల్
ప్రపంచకప్ ప్రారంభానికి మరికొద్ది రోజులే మిగిలున్న దశలో క్రికెట్ బ్యాట్ సైజ్ తగ్గించాలన్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆలోచనపై వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ మండిపడ్డాడు. ప్రస్తుతం క్రికెటర్లు వాడుతున్న బ్యాట్ లు బ్యాట్స్ మన్ కు అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయని, అందుకే క్రికెట్ బ్యాట్సమన్ ఆటగా మారిపోయిందని భావించిన ఐసీసీ, బ్యాట్ సైజుపై పరిమితి విధించాలని నిర్ణయించింది. 10-15 ఏళ్ల క్రితంతో పోలిస్తే బ్యాట్ లోని స్వీట్ స్పాట్ (బంతి ఎక్కువగా తగిలే మధ్య భాగం) వెడల్పుగా ఉంటోందని, దాని కారణంగా బ్యాట్స్ మన్ కొన్ని సందర్భాల్లో గుడ్డిగా ఊపినా బంతి సిక్సర్ కు తరలుతోందని పేర్కొన్న ఐసీసీ, బ్యాట్ పొడవు 38 అంగుళాలు, వెడల్పు 4.25 అంగుళాలు మించకుండా ఉండాలని నిర్ణయించింది. దీనిపై క్రిస్ గేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ ముందు ఈ ప్రతిపాదన ఏంటని గేల్ ఐసీసీని ప్రశ్నించాడు. ఇప్పుడీ నిర్ణయం సరైనది కాదని గేల్ తెగేసి చెప్పాడు. అభిమానులు క్రికెట్ ను బ్యాట్స్ మెన్ గేమ్ గానే చూస్తున్నారన్న గేల్, అలాంటప్పుడు బ్యాట్ సైజులో మార్పు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. వికెట్లు తీసేందుకు బౌలర్లు మరింత కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తే సరిపోతుందని పేర్కొన్నాడు.