: రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగింది: వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో ఏపీకి అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మరోసారి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు కొన్ని హామీలు ఇచ్చారని అన్నారు. 'ఏపీకి ప్రత్యేకహోదాపై జాతీయ మండలి ఆమోదం కావాల్సి ఉంది. లేని పక్షంలో ప్రతి రాష్ట్రం కష్టాల్లో ఉన్నాం, ప్రత్యేక హోదా ఇవ్వండి అని డిమాండ్ చేసే అవకాశం ఉంద'ని అన్నారు. దానిని సరళీకృతం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. విభజన సందర్భంగా జరిగిన చర్చలో ప్రత్యేక హోదా ఇప్పుడే ఇవ్వాలని తాను కోరగా, తెలంగాణ నేతలు వెంకయ్యనాయుడే బిల్లుకు అడ్డుతగులుతున్నాడని విమర్శలు చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విభజన బిల్లులో పేర్కొన్న హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు. కానీ పిండి కొద్దీ రొట్టె అని గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ఏం చేసినా ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకునే చేస్తుందని ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ లు కూడా ప్రత్యక హోదా కోరుతున్నాయని ఆయన చెప్పారు.