: అగ్ని ప్రమాదాలు నివారించేందుకు రోబో ఫైర్ ఫైటర్
ప్రపంచ వ్యాప్తంగా అగ్నిప్రమాదాలు నివారించే క్రమంలో వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వీటిని నివారించేందుకు అమెరికా నేవీ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. వర్జీనియా పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ కు చెందిన రోబోటెక్ నిపుణులతో కలిసిన నేవీ, ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తున్న మనిషిన పోలిన రోబోను తయారు చేసింది. దీనిలో నిప్పు, పొగను గుర్తించే సెన్సర్లు అమర్చారు. దీంతో ఎక్కడ అగ్నిప్రమాదం సంభవించినా ఇది మంటలను ఆర్పేస్తుంది. ప్రస్తుతానికి ఇది మానవ నియంత్రణలోనే పనిచేస్తున్నప్పటికీ, త్వరలోనే దీనికి కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. దీంతో అది తనకు తానుగా మంటలను ఆర్పేయగలుగుతుందని నేవీ అధికారులు పేర్కొంటున్నారు.