: ఆ టికెట్లు హాట్ కేకులేనట... వరల్డ్ కప్ మ్యాచ్ లకు పోటెత్తనున్న అభిమానజనం
మరో తొమ్మిది రోజుల్లో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. దాదాపు నెలకు పైగా సాగే వన్డే వరల్డ్ కప్ కు ఈ ఏడాది వివిధ దేశాలకు చెందిన అభిమానులు పోటెత్తడం ఖాయమని ఐసీసీ చెబుతోంది. ఎందుకంటే, ఆయా మ్యాచ్ ల కోసం ఐసీసీ ముద్రించిన మిలియన్ (10 లక్షలు) టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయట. ఇప్పటికే 7.5 లక్షల టికెట్లను క్రికెట్ ప్రేమికులు కొనుగోలు చేశారు. మిగిలిన రెండున్నర లక్షల టికెట్లు నేడో, రేపో పూర్తిగా విక్రయం కావడం ఖాయమే. ఈ ఏడాది వరల్డ్ కప్ లో మ్యాచ్ లను వీక్షించేందుకు అన్ని క్రికెట్ దేశాల అభిమానులు అమితాసక్తి చూపుతున్నారు. తమ అభిమాన ప్లేయర్ల విన్యాసాలను కళ్లారా చూసేందుకు అన్ని దేశాల క్రికెట్ అభిమానులు వరల్డ్ కప్ బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో, ఐసీసీ కూడా భారీగానే ఏర్పాట్లు చేస్తోంది. ఐసీసీ అంచనాలను మించి అభిమానులు తరలివస్తారని వరల్డ్ కప్ సమరానికి ఆతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు చెబుతున్నాయి.