: తైవాన్ పైలట్ చాకచక్యం... చనిపోతూ కీలక నిర్ణయం తీసుకున్నాడని ప్రశంసలు
తైవాన్ కు చెందిన ట్రాన్స్ఏషియా విమాన ప్రమాదంలో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. విమాన పైలట్ తో పాటు కో-పైలట్ చాకచక్యంగా వ్యవహరించిన కారణంగా పెను ప్రమాదం తప్పిందని నిపుణులు తేల్చారు. చనిపోబోతూ కీలక నిర్ణయం తీసుకున్న సదరు పైలట్ నిర్ణయాన్ని వారు కీర్తిస్తున్నారు. అసలేం జరగిందంటే... 58 మంది ప్రయాణీకులతో బయలుదేరిన విమానం అదుపు తప్పింది. అదుపు తప్పిన విమానం కూలిపోతున్న దశలో ఆకాశహర్మ్యాల వైపుగా దూసుకెళ్లసాగింది. పరిస్థితిని గమనించిన పైలట్, కో-పైలట్ సహకారంతో విమానాన్ని నదిలోకి మళ్లించాడు. దీంతో పల్టీలు కొడుతూనే విమానం నదిలో పడిపోయింది. అయితే, కూలిపోయే క్రమంలో ఒక్క బిల్డింగ్ ను కూడా విమానం తాకలేదు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించకపోయి ఉంటే, విమానం ఆకాశహర్మ్యాలను తప్పనిసరిగా ఢీకొట్టేదే. ఇదే జరిగి ఉంటే, భారీ ప్రాణ నష్టం సంభవించి ఉండేది. తాను చనిపోతున్నానని తెలిసినా, భారీ ప్రాణ నష్టాన్ని నివారించి పైలట్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.