: గన్నవరం ఎయిర్ పోర్టు కన్నా బెజవాడ బస్టాండు బెటర్: అశోక్ గజపతి రాజు
నవ్యాంధ్ర రాజధాని సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి ఆధునిక హంగులు సమకూరనున్నాయి. హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో వసతులు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అంతకుముందు ఆయన గన్నవరం, రాజమండ్రి ఎయిర్ పోర్టుల అధికారులతో సమావేశం నిర్వహించారు. గన్నవరం ఎయిర్ పోర్టు కన్నా బెజవాడ బస్టాండే బాగుందన్న మంత్రి, ఎయిర్ పోర్టులో సౌకర్యాలు ఆశించిన స్థాయిలో లేవన్నారు. రాష్ట్ర విభజన, తుళ్లూరులో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం తదితర కారణాలతో గన్నవరం ఎయిర్ పోర్టు ప్రాధాన్య క్రమంలోకి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో, గన్నవరం ఎయిర్ పోర్టును త్వరితగతిన అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు తరహాలో గన్నవరం ఎయిర్ పోర్టునూ ఆధునికీకరిస్తామని ఆయన వెల్లడించారు.