: నిఘా నీడలో ఐటీ ఉద్యోగులు... తేడా వస్తే బతుకు బస్టాండే!
మంచి జీతం, విలాసవంతమైన జీవితం... ఇదీ ఐటీ ఉద్యోగుల జీవనశైలి. అడ్డూ, అదుపూ లేని జీవితం అనుభవిస్తుంటారనేది చాలా మంది ఐటీ నిపుణులపై ఉన్న ఆరోపణ. కానీ, ఇకపై వీరి కదలికలన్నీ నిఘా నీడలోకి రానున్నాయి. ముఖ్యంగా హైదరాబాదులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆయా సంస్థలు పూర్తి స్థాయిలో కన్నేయబోతున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు ఐటీ ఉద్యోగుల నుంచి సహాయసహకారాలు అందుతున్నాయన్న కారణంతో, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా, చివరకు హైదరాబాద్ తో లింక్ ఉందని తేలుతుండటం కూడా మన పోలీసు ఉన్నతాధికారులను అప్రమత్తమయ్యేలా చేసింది. ఈ నేపథ్యంలో, తమతమ సంస్థల్లో పని చేస్తున్న ప్రతి ఐటీ ఉద్యోగిపై డేగ కన్ను వేసి ఉంచాలని అన్ని సంస్థలకు సైబరాబాద్ పోలీసులు హుకుం జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు ఇంటర్నెట్ లో ఎలాంటి సమాచారం వెతుకుతున్నారు? ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారు? ఎలాంటి సమాచారం అప్ లోడ్ చేస్తున్నారు? లాంటి అనేక విషయాలపై ఐటీ కంపెనీలు ఫోకస్ చేయబోతున్నాయి. ఈ విషయంలో పోలీసు శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు అన్ని ఐటీ సంస్థలు తమ సంసిద్ధతను తెలియజేశాయి. ఇప్పటికే ఈ విషయమై ఐటీ కంపెనీలు, పోలీసు అధికారులు రెండుసార్లు సమావేశమైనట్టు సమాచారం. ఈ క్రమంలో, ఐటీ ఉద్యోగులెవరైనా సరే... వారి పని ఎంత ఉందో, అంత వరకు చేసుకుని బయటపడితే బాగుంటుంది... కొంచెం అటూ, ఇటూ అయితే మాత్రం బతుకు బస్టాండ్ కావడం ఖాయం.