: ఆ రోజున ఫేస్ బుక్ లో 'ఐ లవ్యూ' అని పోస్ట్ చేసినా పెళ్లి చేస్తాం: హిందూ మహాసభ
'వాలెంటైన్స్ డే' రోజున ప్రేమికులు బయట కనిపిస్తే పెళ్లే అని హెచ్చరించిన హిందూ మహాసభ మరో అడుగు ముందుకేసింది. ప్రేమికుల దినోత్సవం నాడు ఫేస్ బుక్ లో 'ఐ లవ్యూ' అని పోస్ట్ చేసినా సరే వెతికి పట్టుకుని మరీ పెళ్లి చేస్తామని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 14న ఫేస్ బుక్ తో పాటు ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లపైనా నిఘా పెడతామని హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు చంద్రప్రకాశ్ కౌశిక్ తెలిపారు. దీనిపై ఇప్పటికే ఢిల్లీలో 8 బృందాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు. 'వాలెంటైన్స్ డే' వారంలో ప్రేమను వ్యక్తం చేయడం భారత సంప్రదాయాలను తుంగలో తొక్కడంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేమికుల రోజున బహిరంగ ప్రదేశాలు, మాల్స్, రెస్టారెంట్లు తదితర ప్రదేశాల్లో కనిపించే హిందూ జంటలకు ఆర్య సమాజ్ పద్ధతిలో పెళ్లి చేస్తామని, ఇతర మతాలకు చెందిన వారైతే 'శుద్ధికరణ' జరిపి అనంతరం పెళ్లి చేస్తామని హిందూ మహాసభ ఇంతకుముందే హెచ్చరించింది.