: ఢిల్లీలో మూగబోనున్న మైకులు... నేటి సాయంత్రం ముగియనున్న ప్రచారం


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వాడీవేడిగా సాగుతున్న ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 7న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లు బరిలోకి దిగడంతో త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ ప్రచారం అంతంతమాత్రంగా సాగగా, ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తున్న బీజేపీ, ఆప్ లు మాటల తూటాలు పేల్చాయి. కార్యాలయాలపైనా దాడులు చేసుకున్నాయి. అన్ని పార్టీల ప్రచారానికి ఢిల్లీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నామినేషన్ సందర్భంగా ఆప్ అధినేత, ఢిల్లీ తాజా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించిన ర్యాలీలో భారీ సంఖ్యలో ఢిల్లీ ప్రజలు పాలుపంచుకున్నారు. ఇక నిన్నటి తన ప్రచార ర్యాలీకి పోటెత్తిన ఢిల్లీ ప్రజాభిమానానికి పొంగిపోయిన బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ కంటతడిపెట్టారు. నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. దీంతో పార్టీల ప్రచార హోరు తగ్గి, ఢిల్లీలో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొననుంది. ఈ నెల 7న జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 10న జరగనుంది.

  • Loading...

More Telugu News