: అవునా... ఆ బాలికలందరి వయసు 19 ఏళ్లేనా?: విచారణకు ఆదేశించిన బరేలీ కోర్టు


మైనారిటీ తీరకుండానే ప్రేమలో పడి ప్రియుళ్లతో పరారవుతున్న బాలికల వయసుపై బరేలీ కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సదరు బాలికల వయసును నిర్ధారిస్తూ వైద్యులు జారీ చేసిన సర్టిఫికెట్లపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని బరేలీ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అసలు విషయమేంటంటే, గడచిన ఆరు నెలల్లో 149 మంది బాలికలు తాము ప్రేమించిన ప్రియుళ్లతో కలిసి పరారయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు బాలికలను అదుపులోకి తీసుకుని ఇళ్లకు చేర్చారు. ఈ ఉదంతాలపై కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసులు బాలికల వయసును నిర్ధారించేందుకు సర్కారీ ఆస్పత్రిని ఆశ్రయించారు. ఇక్కడే మతలబు జరిగింది. ప్రియుళ్లతో కలిసి ఉండాలన్న భావనతో, తమకు మైనారిటీ తీరిందని సర్టిఫికెట్లు జారీ చేయమని బాలికలు వైద్యులకు భారీ మొత్తంలో లంచాలిచ్చారట. దీంతో బాలికల వయసును సదరు వైద్యులు 19 ఏళ్లు దాటిందంటూ సర్టిఫికెట్లు జారీ చేశారు. మొత్తం 149 మంది బాలికల్లో ఒక్క యువతికి మాత్రం 24 ఏళ్లున్నట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యుల సర్టిఫికెట్లను పరిశీలించిన న్యాయమూర్తి, ఇందులో దాగున్న మతలబును గుర్తించిన మీదటే విచారణకు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. మరి, ఈ విచారణలోనైనా వైద్యాధికారులు నిజాన్ని నిగ్గు తేలుస్తారో, లేక తమ వైద్యులను కాపాడుకునేందుకు వారూ తప్పుడు నివేదికలిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News