: ప్రియుడి మోసం కేసులో విచారణకొచ్చి... పోలీస్ స్టేషన్ లోనే ప్రసవించిన యువతి
తనను ప్రేమించి పెళ్లికి నిరాకరిస్తున్న ప్రియుడి మోసంపై ఫిర్యాదు చేసి, విచారణకు వచ్చిన ఓ యువతి పోలీసు స్టేషన్ ఆవరణలోనే ప్రసవించింది. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... బాలానగర్ మండలం మెడిగడ్డ తండాకు చెందిన యువతి, తండాకు చెందిన రమేశ్ తో ప్రేమలో పడింది. ఈ క్రమంలో పెళ్లి కాకుండానే వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో యువతి గర్భం దాల్చింది. అయితే పెళ్లికి రమేశ్ నిరాకరించాడు. ప్రియుడి చేతిలో మోసపోయానని, అతడి వల్ల తల్లిని కాబోతున్నానని సదరు యువతి బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం నిన్న ఆమెను పీఎస్ కు పిలిచారు. విచారణ జరుగుతున్న సమయంలోనే యువతికి పురిటినొప్పులు మొదలయ్యాయి. సమీపంలోని ఆస్పత్రి సిబ్బంది ఆమెకు చికిత్స అందిస్తుండగానే మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే నెలలు నిండకముందే జన్మించిన శిశువు మృతి చెందింది.