: కేసీఆర్ గారూ...ఉమ్మడి సచివాలయాన్ని ఎలా తరలిస్తారు?: కేఈ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్నీ చట్టవిరుద్ధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదు ఉమ్మడి రాజధాని అన్న సంగతిని తెలంగాణ ముఖ్యమంత్రి మర్చిపోయినట్టున్నారని గుర్తుచేశారు. సచివాలయాన్ని కూల్చేస్తే, ఏపీ సచివాలయం ఎలా విభజిస్తారని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల వరకు ఉమ్మడి రాజధానిలోని ప్రభుత్వాలకు సంబంధించిన భవనాలు, నీటి పారుదల సమస్యలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవాలన్న విషయం కేసీఆర్ కు తెలియంది కాదని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల సమస్యలు గవర్నర్ ముందు ఉంచామని తెలిపిన ఆయన, గవర్నర్ ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలియదని పేర్కొన్నారు. ఇప్పటికైనా గవర్నర్ జోక్యం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నారు. తక్షణం కేంద్రం జోక్యం చేసుకుని ఇరిగేషన్, భవనాలపై నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.