: విమానం కూలుతుండగా వీడియో ఎవరు తీశారంటే...!
తైవాన్ లోని తైపీ నదిలో విమానం కూలుతుండగా వీడియో తీశారు. అది క్షణాల్లో యూట్యూబ్ లో అప్ లోడ్ అయింది. దానిని ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అసలు ఈ వీడియోను ఎవరు తీశారు? అంత కరెక్టుగా ఎలా తీయగలిగారు? అంటే విమానం కూలుతుందని వారికి ముందే తెలుసా? అని పలువురి మదిలో ప్రశ్నలు రేగుతున్నాయి. ఈ వీడియో దృశ్యాలు మనుషులు తీసినవి కాదు. కారు డాష్ బోర్డు కెమెరా చిత్రీకరించిన దృశ్యాలు. వాహనంలోని డాష్ బోర్డు పైన విండ్ షీల్డ్ భాగంలో ఈ కెమెరాను ఏర్పాటు చేస్తారు. డ్రైవింగ్ చేసేప్పుడు ముందు కనిపించే దృశ్యాలను ఈ కెమెరా చిత్రీకరిస్తుంది. దీంతో ఇది బ్లాక్ బాక్స్ లా ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఇలా డాష్ బోర్డు కెమెరాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణం. మనదేశంలో ఇప్పుడిప్పుడే ఈ విధానం అమలులోకి వస్తోంది. రష్యాలో కొన్నేళ్ల క్రితం భారీ ఉల్కాపాతం సంభవించింది. దానిని అనేక వాహనాల్లోని డాష్ కామ్ లు బంధించాయి. అనంతరం వాటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాయి. అలాంటి డాష్ కామ్ ఇప్పుడు తైవాన్ లోని తైపీలో విమానం ప్రమాదానికి గురైన దృశ్యాన్ని చిత్రీకరించింది. ఇదిప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.