: 'అమెరికా పయనం' నుంచి 'శ్రీవారికి విరాళం' వరకూ..
కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి తిరుమల వెంకన్నకు రూ. 16 కోట్ల భారీ విరాళం ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. టీటీడీ చరిత్రలో అంత భారీ స్థాయిలో నగదు విరాళం అందుకున్న ఘటనలు కొన్నే. దీంతో, సహజంగానే ఆ వ్యక్తి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఉదారస్వభావానికి మారుపేరులా నిలిచిన ఆ వ్యక్తి పేరు మంతెన రామలింగరాజు. అమెరికాలో పేరున్న పారిశ్రామికవేత్త. పలు ఫార్మా కంపెనీలకు అధిపతి అయిన రామలింగరాజు, తన చుట్టూ ఉన్న వారు కూడా క్షేమంగా ఉండాలని ఆశించే వ్యక్తి.
రామలింగరాజు బాల్యం అంతా హైదరాబాద్ లోనే గడిచింది. ఆయన బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి. అప్పట్లో రామలింగరాజుకు మన సీఎం సార్.. అదేనండీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సహాధ్యాయి కావడం విశేషం. తర్వాత్తర్వాత రామలింగరాజు మణిపాల్ యూనివర్శిటీ నుంచి ఫార్మా సైన్స్ డిగ్రీ చేతపట్టుకుని అమెరికా చేరుకున్నాడు. అక్కడే మాస్టర్స్ డిగ్రీ సంపాదించిన రామలింగరాజు అమెరికా గడ్డపై పలు ఫార్మా కంపెనీలు స్థాపించి అనతికాలంలోనే వాటిని లాభాల బాట పట్టించాడు. ప్రస్తుతం అమెరికా మార్కెట్ లో కేన్సర్ ఔషధాల తయారీలో రామలింగరాజు కంపెనీలదే అధిక వాటా. అలా అలా అంచెలంచెలుగా ఎదిగిన రామలింగరాజు నేడు అమెరికాలో ఓ బిలియనీర్.
తనకు ఎంతో ఇచ్చిన సమాజానికి, ముఖ్యంగా దేశానికి తనవంతుగా ఏదైనా చెయ్యాలన్న తాపత్రయమే శ్రీవారికి రూ. 16 కోట్ల విరాళం ఇవ్వడం వెనుక ప్రధాన ఉద్ధేశం అని వినమ్రంగా చెబుతారు రామలింగరాజు. ఆయన త్వరలోనే భారత్ లో మెడికల్ ఇన్స్యూరెన్స్, బిల్లింగ్ రంగాల్లో గొలుసు సంస్థలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు గంగరాజు గారి అల్లుడే ఈ రామలింగరాజు!