: ఆ రికార్డే టీమిండియాపై ఒత్తిడికి కారణమవుతుంది: వెంకటపతిరాజు
వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు పాకిస్థాన్ పై భారత్ ఓటమిపాలైంది లేదు. తాజా వరల్డ్ కప్ లో పాక్ తో మ్యాచ్ లో ఆ రికార్డే టీమిండియాపై ఒత్తిడి పెంచుతుందని మాజీ స్పిన్నర్ వెంకటపతిరాజు అభిప్రాయపడ్డాడు. మరోవైపు, డిఫెండింగ్ చాంపియన్ ట్యాగ్ లైన్ కూడా జట్టుపై ప్రభావం చూపుతుందన్నాడు. ఫిబ్రవరి 15న అడిలైడ్ లో దాయాదుల సమరం జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజు మాట్లాడుతూ, పాకిస్థాన్ ఓడిపోయినా కోల్పోయేదేమీలేదన్న భావనతో బరిలో దిగుతుందని, అదే సమయంలో ప్రతిష్ఠను కాపాడుకోవాలన్న ఒత్తిడి భారత్ జట్టుపై ఉంటుందని విశ్లేషించాడు. ఇక, అభిమానుల్లోనూ ఒత్తిడి ఉంటుందన్నాడు. ఇప్పటివరకు భారత్ గెలుస్తుండడాన్నే చూశారని, అందుకే, వారిపైనా ఒత్తిడి ఉంటుందని వివరించాడు. రాజు ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ లో డెవలప్ మెంట్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నాడు.