: 'వాలెంటైన్స్ డే' రోజు బయట కనిపిస్తే పెళ్లే... ప్రేమికులకు హిందూ మహాసభ హెచ్చరిక
ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు ఫిబ్రవరి 14వ తేదీని అపురూపంగా భావిస్తారు. ఆ రోజు 'వాలెంటైన్స్ డే' కావడమే అందుకు కారణం. అయితే, ఆ రోజున భారత్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ప్రేమ జంటలు బయటికి రావాలంటే జంకుతారు. గత కొన్నేళ్లుగా, హిందుత్వ సంస్థలు దేశంలో వాలెంటైన్స్ డే నిర్వహణకు అభ్యంతరం చెబుతున్నాయి. అది విదేశీ పండుగ అని, మన సంస్కృతికి అది సరిపడదని సూత్రీకరిస్తున్నాయి. అంతేగాదు, ఆ రోజున బయట కనిపించిన ప్రేమికులకు బలవంతంగా పెళ్లిళ్లు కూడా చేశారు. ఈసారి కూడా అలాగే చేస్తామంటున్నాయి కొన్ని హిందుత్వ సంస్థలు. మరో పది రోజుల్లో 'వాలెంటైన్స్ డే' ఉండగా, ఇప్పటి నుంచే హెచ్చరికలకు తెరదీశాయి. హిందూ జంటలు కనిపిస్తే వారికి ఆర్య సమాజ్ తరహాలో పెళ్లి చేస్తామని, వేర్వేరు మతాలకు చెందిన ప్రేమ జంటలు కనిపిస్తే వారికి 'శుద్ధికరణ్' నిర్వహించి, అనంతరం పెళ్లి చేస్తామని హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు చంద్రప్రకాశ్ కౌశిక్ తెలిపారు. సంవత్సరంలో 365 రోజులు ప్రేమగా గడపాలని భావించే దేశం భారత్ అని, అలాంటప్పుడు ప్రేమ జంటలు ఫిబ్రవరి 14వ తేదీని మాత్రమే 'వాలెంటైన్స్ డే'గా జరుపుకోవడం ఎందుకు? అని ప్రశ్నించారు.