: ఆసుపత్రి నిర్వహణలో లాభాలు ఆశించడం లేదు: బాలకృష్ణ
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాదు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, లాభాలు ఆశించకుండా ఆసుపత్రి నిర్వహిస్తున్నామని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. క్యాన్సర్ వ్యాధి గురించి భయపడాల్సిన పనిలేదని, నయం అవుతుందని పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇక, స్పీకర్ కోడెల మాట్లాడుతూ, సెల్ ఫోన్ల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. పొగాకు, దాని ఉత్పత్తుల కారణంగా క్యాన్సర్ పీడితుల సంఖ్య పెరుగుతోందన్నారు.