: హోం వర్క్ చేయలేదని విద్యార్థినిని బాదేసింది... మద్దతివ్వలేదని హెడ్ మాస్టర్ ను చెప్పుతో కొట్టింది!
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురుతర బాధ్యతను మరచిన ఓ లేడీ టీచర్ గతి తప్పారు. విద్యార్థినిపై చేయి చేసుకున్న టీచర్, మద్దతివ్వలేదని హెడ్ మాస్టర్ పైనా తిట్ల దండకం అందుకుంది. అంతటితో ఆగని ఆ ఉపాధ్యాయురాలు హెడ్ మాస్టర్ పై చెప్పుతో దాడి చేసింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాచిలి పాఠశాలలో నేటి ఉదయం కలకలం సృష్టించిన ఈ ఘటనపై విద్యాశాఖాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. హోం వర్క్ చేయలేదన్న కారణంతో మూడో తరగతి చదువుతున్న ఓ చిన్నారిని ఉపాధ్యాయురాలు పద్మ చితకబాదింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ గ్రామస్థుల పక్షమే వహించారట. దీంతో, ఒక్కసారిగా విచక్షణ కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోయిన ఆ టీచర్, గ్రామస్థుల సమక్షంలోనే హెడ్ మాస్టర్ పై చెప్పుతో దాడి చేసింది. దీనిపై హెడ్ మాస్టర్, గ్రామస్థుల నుంచి సమాచారం అందుకున్న జిల్లా విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.