: జలందర్ లో కిడ్నాపైన బాలుడిని రక్షించిన హైదరాబాద్ పోలీసులు... ఇద్దరు కిడ్నాపర్ల అరెస్ట్
పంజాబ్ రాష్ట్రంలోని జలందర్ లో కిడ్నాపైన 13 ఏళ్ల బాలుడు అనూప్ ను హైదరాబాద్ పోలీసులు రక్షించారు. కిడ్నాపర్ల చెరలోని బాలుడిని గుర్తించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడిని కాపాడారు. జలందర్ లో కిడ్నాప్ చేసిన అనూప్ ను హైదరాబాదుకు తీసుకువచ్చిన కిడ్నాపర్లు బేగంపేటలోని శ్యాంలాల్ బిల్డింగ్ లో దాచారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బిల్డింగ్ పై దాడి చేసి కిడ్నాపర్ల చెర నుంచి బాలుడికి విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు ఇద్దరు కిడ్నాపర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జలందర్ పోలీసులతో పాటు బాలుడి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు.