: వాస్తు లేకుండానే కేసీఆర్ సీఎం అయ్యారా?: డీకే
రాష్ట్ర సచివాలయం మారుస్తామంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ సమస్యను పరిష్కరించడం మానేసిన కేసీఆర్ అద్భుతమైన కట్టడాలంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. సచివాలయానికి వాస్తు సరి లేకుండానే కేసీఆర్ ముఖ్యమంత్రిగా వెళ్లారా? అని ఆమె ప్రశ్నించారు. రైతుల సమస్యలు తెలియని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని ఆమె పేర్కొన్నారు. అధికార బలంతో ఇతర పార్టీల నేతలను ఆకట్టుకున్న ముఖ్యమంత్రి, వారి చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తే ఎవరి బలమేంటో తెలిసిపోతుందని ఆమె సవాలు విసిరారు. ప్రభుత్వ పని తీరు బాగుందని జబ్బలు చరుచుకుంటున్న కేసీఆర్, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఎందుకు వెనకాడుతున్నారని ఆమె నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు సర్వే నిర్వహించిన కేసీఆర్ కి వార్డులను విభజించడం చేతకావడం లేదా? అని ఆమె ప్రశ్నించారు. సొంత అజెండాతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె అన్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంటే చూస్తూ మౌనం వహిస్తున్న తెలంగాణ మంత్రులు దద్దమ్మలని ఆమె పేర్కొన్నారు.