: పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే ఏటీఎంకు వెళ్తే సరిపోతుంది
ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిందే. కానీ, ఛండీగఢ్ లో మాత్రం ఏటీఎంకు వెళ్తే సరిపోతుంది. అదేంటి, ఏటీఎంకు వెళ్లి డబ్బులు కదా డ్రా చేసుకుంటాం, పోలీసులకు ఫిర్యాదు ఎలా చేస్తాం అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి. ఏటీఎం ద్వారా ఫిర్యాదులు నమోదు చేసే విధానానికి ఛండీగఢ్ పోలీసులు రూపకల్పన చేశారు. 'ఐ-క్లిక్' పేరిట రూపకల్పన చేసిన ఈ సౌకర్యం ద్వారా బాధితులు పోలీస్ స్టేషన్ గడప తొక్కకుండానే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఏటిఎంలో నమోదు చేసిన ప్రోగ్రాం ద్వారా పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానించి ఉంటుందని, ఏటీఎంలో అది సులభంగా అర్థమయ్యేలా ఉంటుందని ఛండీగఢ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆప్ పోలీస్ ఆర్పీ ఉపాధ్యాయ వెల్లడించారు. ఏ సమయంలోనైనా ఏటీఎం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్న ఆయన, ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందిస్తారని తెలిపారు. ఈ సౌకర్యం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.