: కేసీఆరూ... రాజయ్య ఎంత నొక్కేశాడో చెప్పు: వీహెచ్
మంత్రి వర్గ సహచరులెవరైనా అవినీతికి పాల్పడితే ముఖ్యమంత్రి వారిని పిలిచి వివరణ అడిగి తెలుసుకోవడం ఆనవాయతీ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సంప్రదాయాలను తోసిరాజని ముఖ్యమంత్రి సహచర మంత్రిని బర్తరఫ్ చేయడం చరిత్రలో ఇదే ప్రథమమని అన్నారు. అవినీతికి పాల్పడితే బర్తరఫ్ చేయడం సమంజసమేనని, అయితే, రాజయ్య ఎంత అవినీతికి పాల్పడ్డాడో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. కేవలం దళితుడని రాజయ్యను తొలగించారని ప్రజలంతా అనుకుంటున్నారన్న వీహెచ్, అవినీతి నేపథ్యంలోనే తీసేశానని కేసీఆర్ రుజువు చేయాలని సూచించారు. అధికారులు అవినీతికి పాల్పడితే వారిని సస్పెండ్ చేస్తారని, రాజయ్య విషయంలో అలా జరగలేదు కనుక, అధికారుల తప్పు లేనట్టేనని, అయితే, రాజయ్య ఎంత స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతిని సహించడనో, నియంతృత్వ స్వభావం కలవాడనో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, తక్షణం రాజయ్య అవినీతి వివరాలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.