: టీమిండియా నెట్ బౌలర్ మృతి... ముగ్గురికి అవయవదానం
అభిషేక్ ఠాకూర్... వర్ధమాన క్రికెటర్. 18 ఏళ్ల ఈ కుర్రాడు జాతీయస్థాయికి తప్పక ఎదుగుతాడని అందరూ భావించారు. కానీ, దురదృష్టవశాత్తూ అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పుణే-బెంగళూరు హైవేపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో, అతడి అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు. దీంతో, ముగ్గురు వ్యక్తులకు జీవనదానం లభించినట్టయింది. పుణేలోని విఖ్యాత నెస్ వాడియా కాలేజిలో ఫస్టియర్ బీకామ్ చదువుతున్నాడు. ప్రతిభావంతుడైన లెఫ్టార్మ్ స్పిన్నర్ గా పేరుపొందాడు. అతని నైపుణ్యాన్ని గుర్తిస్తూ బీసీసీఐ తరచుగా టీమిండియా బ్యాట్స్ మెన్ కు నెట్స్ లో బౌలింగ్ చేసేందుకు ఆహ్వానిస్తుంటుంది. గతేడాది డిసెంబర్ 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడి మెదడుకు తీవ్రగాయం కావడంతో మృత్యువు ఒడిలోకి జారుకున్నాడు. వెంటిలేటర్ పై మూడు రోజుల పాటు చావు బతుకుల మధ్య పోరాడిన అభిషేక్ నాలుగో రోజు కాస్త కోలుకున్నట్టే కనిపించాడు. దీంతో, వెంటిలేటర్ తొలగించారు. అయితే, ఉన్నట్టుండి పరిస్థితి విషమించింది. అనంతరం, అతడు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు ఇక, తమ బిడ్డ దక్కడని భావించిన అతని తల్లిదండ్రులు అవయవదానం చేశారు. అతని రెండు కిడ్నీలు, లివర్ ను ముగ్గురు వ్యక్తులకు అమర్చగా, వారిప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు.