: కొండముచ్చులను అద్దెకు తెచ్చుకుంటున్న ఆగ్రా వధువులు
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో పెళ్లిళ్ల పాలిట కోతులు విలన్లుగా పరిణమించాయి. వివాహ వేడుకల్లో కోతులు విధ్వంసకాండకు దిగుతున్నాయట. ఇది వధువుల కుటుంబాలకు పెద్ద తలనొప్పిలా తయారైంది. దీంతో, వారో ఉపాయం ఆలోచించారు. కోతులకు ప్రధాన శత్రువులైన కొండముచ్చులతో వాటికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రజల అవసరాన్ని గమనించిన కొందరు కొండముచ్చులను అద్దెకిస్తామంటూ తయారయ్యారు. రూ.1,500 నుంచి రూ.10,000 వరకు వాటి అద్దె పలుకుతోంది. ముందుగా బుక్ చేసుకుంటే రూ.1500 నుంచి రూ.3,000... అర్జెంటుగా కావాలంటే రూ.5,000 నుంచి రూ.10,000 చెల్లించాల్సిందేనట. ఇక, కొన్ని మ్యారేజ్ హాళ్ల యజమానులు నెలవారీ ప్యాకేజీలు కుదుర్చుకుంటున్నారట ఈ కొండముచ్చుల సొంతదార్లతో. ఈ ప్రకారం నెలకు రూ.30,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తున్నారని అక్కడి వర్గాలంటున్నాయి. శీతాకాలంలో ఇక్కడ వివాహాలను బహిరంగంగానే నిర్వహించడం ఎక్కువైందని, తదనుగుణంగా కోతుల బెడద కూడా ఎక్కువగానే ఉందని స్థానికులు అంటున్నారు. కొండముచ్చు ఉంటే కోతులు ఆ దరిదాపుల్లోకి కూడా రావని వారు తెలిపారు.