: వరల్డ్ కప్ లో సత్తా చాటుతానంటున్న ఏడడుగుల ఇర్ఫాన్
పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ వరల్డ్ కప్ లో సత్తా చాటడమే తన లక్ష్యమంటున్నాడు. ఏడడుగుల ఒక అంగుళం ఎత్తున్న ఈ ఆజానుబాహుడు అభిమానులను తప్పక అలరిస్తానని చెబుతున్నాడు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "నా ఎత్తు కారణంగానే ప్రజలు నన్ను గుర్తిస్తారు. అందుకే వారితో ఫొటోలకు పోజులిచ్చి సంతోషపెడుతుంటాను. వరల్డ్ కప్ సందర్భంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోనూ ఫ్యాన్స్ తో ఫొటోలకు సిద్ధంగా ఉన్నాను. అయితే, నా కర్తవ్యం మర్చిపోను. పాక్ జట్టు కప్ నెగ్గేంతవరకు విశ్రమించను" అని పేర్కొన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెటర్లందరిలోకీ ఇర్ఫానే పొడగరి. ఈ లెఫ్టార్మ్ పేసర్ తన వరల్డ్ కప్ సన్నద్ధత గురించి చెబుతూ, బ్యాట్స్ మెన్ ను కుదురుకోనీయకుండా చేయడమే తొలి ప్రాధాన్యత అని తెలిపాడు. 1992లో వసీం అక్రమ్ తరహాలోనే తాను కూడా జట్టుకు తోడ్పడాలని భావిస్తున్నట్టు తెలిపాడు. కాగా, ఇర్ఫాన్ గురించి పాక్ కెప్టెన్ మిస్బా మాట్లాడుతూ, అజ్మల్ గైర్హాజరీలో ఇర్ఫాన్ కీలకం కానున్నాడని పేర్కొన్నాడు.