: రాజయ్యకో నీతి, తలసానికో నీతా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్
తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిప్పులు చెరిగారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కోర్టులు తప్పుబడుతున్నా తెలంగాణ సర్కారు తీరులో మార్పు రావడం లేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల ఓడిపోతామనే భయంతో గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు కేసీఆర్ ప్రభుత్వం వెనుకాడుతోందని ఎద్దేవా చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకైనా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని సూచించిన ఆయన, పెండింగులో ఉన్న ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ల ఎన్నికలు కూడా నిర్వహించాలని అన్నారు. వివరణ కూడా అడగకుండా ఉన్నపళాన మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను బర్తరఫ్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదని ఆయన నిలదీశారు.