: బ్యాంకులో లాకర్లు తెరవలేక కంప్యూటర్లు ఎత్తుకెళ్ళిన దొంగలు
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో దొంగతనానికి వచ్చిన దొంగలు బలమైన లాకర్లను పగలగొట్టలేక, చివరికి 'ఏదో ఒకటిలే' అనుకుని అక్కడి కంప్యూటర్లను ఎత్తుకెళ్ళారు. ఈ ఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని ఎస్బీఐలో జరిగింది. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత రాత్రి ఎస్బీఐ శాఖలో ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. దుండగులు లాకర్లు తెరిచే ప్రయత్నం చేయగా వీలుకాకపోవడంతో విరమించుకున్నారు. దీంతో, బ్యాంకులోని 3 సీపీయూలు, 2 మానిటర్లు, 2 ప్రింటర్లను వారు దొంగిలించారు. కాగా, దొంగతనం జరిగిన సమయంలో బ్యాంకులోని లాకర్లలో సుమారు రూ.93 లక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దొంగతనం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని సెల్టవర్లలో నమోదైన వివరాల మేరకు, ఫోన్ సంభాషణల ఆధారంగా వారు ఎవరితో మాట్లాడారో గుర్తించి, నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.