: ఇండియా, పాక్ మ్యాచ్ లో సందడి చేయనున్న అమితాబ్
ఈ నెల 14న ఐసీసీ ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. 15వ తేదీన దాయాది దేశాలైన భారత్, పాక్ ల మధ్య అత్యంత ఆసక్తికర పోరు జరగబోతోంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లన్నీ ఎప్పుడో అమ్ముడుబోయాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఈ మ్యాచ్ ను వీక్షిస్తారని ఇప్పటికే అంచనాలున్నాయి. వైరి దేశాలు తలపడుతుండటంతో ఈ మ్యాచ్ కు ఇంతటి క్రేజ్ వచ్చింది. అయితే, ఈ మ్యాచ్ కు మరో అదనపు ఆకర్షణ కూడా రానుంది. అదేంటంటే, ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ మ్యాచ్ కి కామెంటరీ చెప్పనున్నారు. హర్షా బోగ్లే, కపిల్ దేవ్ లతో కలసి కామెంటరీ బాక్స్ లో బిగ్ బీ సందడి చేయనున్నారు. ఇప్పటి వరకు సినిమాలకే కాకుండా, ఎన్నో రకాల సామాజిక అంశాలకు తన గొంతిచ్చిన అమితాబ్... ఇప్పుడు తన గంభీరమైన గొంతుతో క్రికెట్ అభిమానులను అలరించబోతున్నారు.