: ప్యాకేజి చిన్నదైనా... పవర్ ఎక్కువ!: సచిన్ కు రిచర్డ్స్ ప్రశంస
భారత బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ తన ఫేవరెట్ ఆటగాడని కరీబియన్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అంటున్నాడు. ఆకారం పరంగా భారీగా కనిపించకపోయినా, అంత చిన్న ప్యాకేజిలో అన్ని సంగతులు కనిపిస్తాయని సచిన్ ఆటతీరును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అతడో లెజెండ్ అని పేర్కొన్నాడు. ఏదైనా డ్రీమ్ టీంను సచిన్ లేకుండా ఎంపిక చేస్తే అంతకంటే సిగ్గుచేటు ఉండదని పేర్కొన్నాడు. ఐసీసీకి రాసిన ఓ వ్యాసంలో రిచర్డ్స్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అంతేగాకుండా, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీపైనా ప్రశంసల జల్లు కురిపించాడీ మాజీ కెప్టెన్. వన్డేల్లో కోహ్లీ నమ్మదగిన ఆటగాడని కితాబిచ్చాడు. అలాగని టెస్టుల్లో రాణించడన్నది తన అభిప్రాయం కాదని, వన్డే క్రికెట్లో అతని దూకుడును ఇష్టపడతానని తెలిపాడు. ఇక, సచిన్, కోహ్లీతోపాటు బ్రయాన్ లారా, క్రిస్ గేల్, ఏబీ డివిల్లీర్స్, మాథ్యూ హేడెన్, రికీ పాంటింగ్, మైకేల్ హస్సీల ఆటతీరును కూడా రిచర్డ్స్ ప్రస్తుతించాడు.