: 11 శాతం తగ్గిన విమాన ఇంధన ధర... డీజిల్ కన్నా చౌక!


దిగొచ్చిన ముడిచమురు ధరల పుణ్యమాని విమాన ఇంధనం ధరలు భారీగా తగ్గాయి. ఎంతగా అంటే ప్రస్తుతం విమాన ఇంధన ధర డీజిల్ కన్నా చౌకగా ఉంది. విమానయాన సంస్థల నిర్వహణా ఖర్చులో సుమారు 40 శాతంగా ఉన్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటీఎఫ్) ధరను 11.3 శాతం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు ప్రకటించాయి. ప్రతి నెలా నిర్వహించే ధరల సమీక్షలో భాగంగా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించాయి. కాగా, గతనెలలో పెట్రోల్ కంటే చౌకగా మారిన జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్), తాజా తగ్గింపుతో డీజిల్ కంటే తక్కువ ధరలో లభించనుంది. ఢిల్లీ మార్కెట్లో కిలో లీటరు (వెయ్యి లీటర్లు) ఏటీఎఫ్ రేటు రూ.5,909.90 తగ్గి రూ.46,513.02కు చేరింది. అంటే లీటరు ధర రూ.46.51 అన్నమాట. దేశవాళీ మార్కెట్లో లీటరు డీజిల్ విక్రయ ధర రూ.58కి అటూఇటుగా లభిస్తున్న సంగతి తెలిసిందే. విమాన ఇంధన ధరల చరిత్రలో ఇదే అతిపెద్ద తగ్గింపు.

  • Loading...

More Telugu News