: అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు స్వైన్ ఫ్లూ... విశాఖలో వైద్య చికిత్స!
తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి ప్రజా ప్రతినిధులనూ ఇబ్బందులపాల్జేస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు గతంలో స్వైన్ ఫ్లూ సోకిందన్న వార్తలు కలకలం రేపాయి. ఆ తర్వాత ఆమె తల్లి, కేసీఆర్ సతీమణి కూడా అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరారు. ఇక కేసీఆర్ కూడా కొన్ని రోజుల పాటు అనారోగ్యంతో సతమతమయ్యారు. కేసీఆర్ కు కూడా స్వైన్ ఫ్లూ సోకిందని పుకార్లు కూడా వ్యాపించాయి. తాజాగా విశాఖ జిల్లా అరకు లోక్ సభ సభ్యురాలు కొత్తపల్లి గీత స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఎంపీ గీత, విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆమె రక్త నమూనాలను సేకరించిన వైద్యులు పరీక్షల నిమిత్తం వాటిని హైదరాబాదుకు పంపారు. వైద్య నివేదికల్లో భాగంగా గీతకు స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది. చికిత్సతో గీత ఆరోగ్యం మెరుగుపడిందని, మరో రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.