: హర్షించాల్సింది పోయి శిక్షించారు!
ఎవరైనా మంచి పనిచేస్తుంటే ఏ కొందరో తప్ప మిగతావాళ్లు హర్షం వ్యక్తం చేయడం సహజం. అయితే, బ్రిటన్ లో ఓ బాలుడు క్యాన్సర్ పీడితుల కోసం నిధులు సేకరిస్తుంటే అభినందించాల్సిన స్కూలు యాజమాన్యం అతడిని శిక్షించింది. నార్త్ సోమర్ సెట్ కు చెందిన స్టాన్ లాక్ అనే 14 ఏళ్ల బాలుడు క్యాన్సర్ బాధితులకు చేయూతనిచ్చేందుకు నడుంబిగించాడు. అనుకున్నదే తడవుగా గుండు చేయించుకుని వారికి సంఘీభావం ప్రకటించి, మాక్ మిలన్ సంస్థ తరపున నిధుల సేకరణకు రంగంలోకి దిగాడు. ఇప్పటివరకు రూ.30 వేలు సేకరించాడు. అయితే, స్కూలు యాజమాన్యం మాత్రం విద్యార్థి గుండు చేయించుకోవడాన్ని తప్పుబట్టింది. అది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ అతడిని ఓ గదిలో బంధించింది. జట్టు పెరిగేంత వరకు స్టాన్ లాక్ మిగతా విద్యార్థులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. తదుపరి ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని హెడ్ టీచర్ డాక్టర్ బారీ రాటెన్ పేర్కొన్నారు. కాగా, స్టాన్ లాక్ సేవా గుణం పట్ల అతడి తల్లి మెలానీ గర్విస్తున్నట్టు తెలిపింది.