: ఆనాడు వైఎస్ సంతకం చేస్తే రుణాలు మాఫీ అయ్యేవి: జగన్
రుణమాఫీ అంశంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చేపట్టిన రెండు రోజుల దీక్ష ఆదివారం సాయంత్రం ముగిసింది. ముగింపు సందర్భంగా జగన్ ప్రజలనుద్దేశించి ఆవేశంగా ప్రసంగించారు. ఆ రోజుల్లో వైస్ సంతకం చేస్తే రుణాలు మాఫీ అయ్యేవని, నేడు అడ్డగోలు నిబంధనలతో రైతులను ఇక్కట్ల పాల్జేస్తున్నారని మండిపడ్డారు. రూ.87 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయాల్సి ఉంటే, చంద్రబాబు సర్కారు రూ.5 వేల కోట్లే మాఫీ చేసిందని దుయ్యబట్టారు. ఎంత మంది రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆధార్ కార్డున్న వారిని రైతులే కాదు పొమ్మంటున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రుణమాఫీ వ్యవహారం పంచపాండవుల కథలా ఉందన్నారు. పొరబాటున కూడా చంద్రబాబు ఏనాడూ నిజం చెప్పలేదని ఎద్దేవా చేశారు. షాక్ కొట్టే విధంగా రాష్ట్రంలో ఇసుక రేట్లు పెంచేశారని, ట్రాక్టర్ ఇసుక రేటు ఐదు రెట్లు పెరిగిందని అన్నారు. చంద్రబాబు గత చరిత్ర చూస్తే భయంగా ఉందని అన్నారు. ప్రజలపై భారం మోపేందుకే ఖజానాలో డబ్బుల్లేవంటున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలన్నిటిని అటకెక్కించిన బాబు, విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మనసు మార్చుకోకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని జగన్ హెచ్చరించారు.