: మా పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్ర: సీబీఐ విచారణలపై దీదీ గుస్సా!
శారదా చిట్ ఫండ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరే జైలుకెళుతున్నారు. మొన్న పార్టీ ఎంపీ, నిన్న కేబినెట్ మంత్రి, తాజాగా అదే బాటలో కేంద్ర మాజీ మంత్రి! ఈ కేసులో సీబీఐ విచారణకు సంబంధించి పూర్తిగా సహకరిస్తానని ముకుల్ రాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పార్టీ ముఖ్యులతో నిన్న అత్యవసర భేటీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తమ పార్టీపై కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అవలంబిస్తున్న వైఖరిని ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం. పశ్చిమ బెంగాల్ లో బలపడేందుకు పావులు కదుపుతున్న బీజేపీ, తమ పార్టీలో చీలికలు తెచ్చేందుకు యత్నిస్తోందని దీదీ ఆరోపించారు. అందులో భాగంగానే సీబీఐ దర్యాప్తు పేరిట తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. సీబీఐ విచారణ, జైలు తదితర అంశాలతో తమ పార్టీ నేతలను భయపెట్టి తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.