: జగన్ పనిలేక చేస్తున్న దొంగ దీక్ష ఇది: చినరాజప్ప
వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేపట్టిన దీక్ష పనిలేక చేస్తున్న దొంగ దీక్ష అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా అవిడిలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని అన్నారు. రైతు రుణమాఫీ మొదటి దశ ఇప్పటికే పూర్తైందని తెలిపిన ఆయన, రుణమాఫీపై జగన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా రాష్ట్రాభివృద్ధికి పాటు పడాల్సిన జగన్, విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. విభజన అనంతరం ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు చక్కగా పరిపాలిస్తున్నారని కితాబునిచ్చారు. అది చూసి ఓర్వలేక జగన్ దొంగదీక్షలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.