: డిగ్గీ రాజా లాంటి వారే పార్టీని చెడగొట్టారు: వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతల మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. ఈ క్రమంలో, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై సీనీయర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం నేతలు చేస్తున్న ధర్నాకు పొన్నాల వెళ్లడమేంటని ఆయన మండిపడ్డారు. ఉద్యమమే చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీనే చేయవచ్చు కదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సమన్వయ కమిటీ బాధ్యతలు ఏమిటో కూడా అర్థం కావడం లేదని అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతల వ్యవహారశైలితో... టీడీపీతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు కుదిరిందేమో అన్న సందేహం కార్యకర్తల్లో నెలకొందనే అనుమానం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కూడా వీహెచ్ ఉతికి ఆరేశారు. డిగ్గీలాంటి నేతలు ఢిల్లీ నుంచి వచ్చి పార్టీని చెడగొట్టారని మండిపడ్డారు. దిగ్విజయ్ సింగ్ కేవలం సమస్యలు వింటారే తప్ప... పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోరని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారి వల్ల పార్టీ భ్రష్టు పడుతోందని దుయ్యబట్టారు.