: దొందూ దొందే... ఆప్ లో 23 మంది, బీజేపీలో 29 మంది నేరచరితులే!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు అంగ, అర్థ బలాలకే ప్రాధాన్యం ఇచ్చాయి. నయనో భయానో ఓట్లను రాబట్టే గెలుపు గుర్రాలకే అసెంబ్లీ సీట్లు ఇచ్చాయి. గెలుస్తాడనుకుంటే చాలు... అభ్యర్థి గత చరిత్రను పక్కనబెట్టి, నేరాలు చేసిన నేపథ్యమున్నా టికెట్లు ఇచ్చాయి. ఈ విషయంలో రాజకీయాలను ప్రక్షాళన చేస్తామని వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీసిపోలేదు. ఆ పార్టీ టికెట్లు ఇచ్చిన వారిలో 23 మంది పలు క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే 29 మంది నేర చరితులకు ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన వారిలో 21 మందికి నేర చరిత్ర ఉంది. మొత్తం 673 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, వీరిలో 17 శాతం మందిపై వివిధ క్రిమినల్ కేసులు ఉన్నాయి.