: అద్భుతం... ఆధ్యాత్మికం... ఎక్కడ చూసినా హనుమంతుడి నామస్మరణే!
ఆంధ్రా ప్యారిస్ గా పేరున్న తెనాలి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని జానకీ రామ హనుమత్ ప్రాంగణంలో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఉదయం 8:30 గంటలకు అత్యంత భక్తి ప్రపత్తులతో ప్రారంభమయింది. మైసూర్ దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి దగ్గరుండి 1.11 లక్షల మంది భక్తులతో ఏకకాలంలో పారాయణం చేయించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకూ సాగే పారాయణానికి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తదితర వీఐపీలు హాజరయ్యారు. నగరమంతా వేదికకు దారితీసే దారులు కాషాయ జెండాలు, వివిధరకాల హనుమంతుని చిత్రాలతో శోభాయమానంగా వెలుగుతోంది. వేదికవద్ద ఏర్పాటు చేసిన పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం అందరినీ ఆకర్షిస్తోంది. హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భక్తులు తాగునీరు, భోజన వసతి, మరుగుదొడ్ల సదుపాయం కల్పించారు. భక్తులకోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.